యో యో హనీ సింగ్ గురించి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. హిప్ హాప్ ఆర్టిస్ట్ గా, ర్యాపర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి యో యో హనీ సింగ్. ఆయన గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్ విడుదల చేయడానికి సిద్ధమైంది నెట్‌ఫ్లిక్స్. బుధవారం ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ డాక్యుమెంటరీకి బేర్ ఇట్ ఆల్ డాక్యు ఫిల్మ్ అని పేరు పెట్టారు మేకర్స్. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో యో యో హనీ సింగ్ జీవితంలోని విశేషాలను పొందుపరిచారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన సడన్‌గా ఎందుకు మాయమయ్యారు? ఆ సమయంలో ఇండస్ట్రీ ఏమనుకుంది? ఫ్యాన్స్ ఎలా ఫీలయ్యారు? మీడియా అటెన్షన్ నుంచి ఆయన ఎలా దూరంగా ఉండగలిగారు వంటి వివరాలతో తెరకెక్కింది ఈ డాక్యుమెంటరీ.
వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిపరమైన విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో పొందుపరచారు. యో యో హనీసింగ్ పూర్తి పేరు హిర్దేష్ సింగ్.
బేర్ ఇట్ ఆల్ డాక్యు ఫిల్మ్ లో యో యో హనీసింగ్‌కి ఆది నుంచీ సాయం చేసిన వారందరి గురించిన వివరాలున్నాయి. వారందరి పక్కన ఆయనే కూర్చుని మాట్లాడించారు. తన డాక్యు ఫిల్మ్ బేర్ ఇట్ ఆల్ గురించి యో యో హనీ సింగ్ మాట్లాడుతూ "నా అభిమానుల నుంచి అత్యంత గొప్ప ప్రేమాభిమానాలను పొందాను. వాళ్లకి నా గురించి పూర్తి కథ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితం, పుట్టుక, పెరిగిన విధానం, నా విద్యాభ్యాసాలు, కష్టనష్టాలు, ఎదిగిన క్రమం అన్నిటినీ గురించి ఈ డాక్యుమెంటరీలో నెట్‌ఫ్లిక్స్ చాలా నిజాయతీగా చెప్పింది" అని అన్నారు.
యో యో హనీ సింగ్ పేరు చెప్పగానే బ్రౌన్ ర్యాంగ్, దేశీ కళాకార్, లుంగి డ్యాన్స్ పాటలు గుర్తుకొస్తాయి.
హనీసింగ్ డాక్యుమెంటరీని మోజేజ్ సింగ్ దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ డాక్యుమెంటరీని నిర్మించే బ్యానర్ శిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఇటీవల ది ఎలిఫెంట్ విస్పరర్స్ తెరకెక్కించినందుకు గానూ ఆస్కార్ దక్కింది. ఈ ఏడాదే హనీసింగ్ జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఓటీటీ సంస్థ. ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించడం ఆనందంగా ఉందన్నారు గునీత్ మోంగా.